20, డిసెంబర్ 2011, మంగళవారం

ఓణీ పండుగ

కన్నుల పండుగ స్నేహ ఓణీ పండుగ
తల్లి అరుణ అండగ ..తండ్రి G V ఉండగ.. తమ్ముడు సాకేత్ తోడుగ
చూడ చక్కని కనులు నిండు బంగరు నగలు
కనుబొమ్మల నడుమ విరిసిన నెలవంక
చిరునవ్వున వెలసిన చంద్రవంక
సింగారింపుల ఈ చిట్టి గువ్వ సందడి చేసె తన కాలి మువ్వ
పాపిట నందు విరజిమ్ము పసిడి సింధూరం
నడుమునందు నడయాడు వన్నె తెచ్చిన వడ్డాణం
నల్ల త్రాచును మించిన తన వాలుజడ కుచ్చుల వయ్యారం చిత్రించ
వల్ల కాదని వగచె వర్మ చేతి కుంచెల డొల్లతనం
మెడలో వెలిసిన ముత్యాలు తలలో విరిసిన పుష్పాలు
సిగలో చేరామన్న సువాసన భరిత మల్లె పూల దర్పం
అంతటి భాగ్యానికి నోచుకోలేదన్న తొటి మల్లెల బుంగమూతి వైనం
అంతలోనే విచ్చేసిన తరుణీమణుల సిగల్లో దోబూచులాడుతున్నామన్న తమ దరహాసం
ఓ వైపు మల్లెల సువాసనతో మగువల మనసులు
మత్తెక్కిన చూపులతో తమ మగవారి ఓరచూపులు,
మరోవైపు పంచభక్షాలను మరిపించేటి తినుబండారాలు
వెరసి మురిపించారు గాదె వంశ వర్గీయులు ..

7, డిసెంబర్ 2011, బుధవారం

ధూమపానం..

ఎంత వలదన్నా వినదీ పాడు మనసు

పదే పదే కావలంటుంది వచ్చాక ఓ వయసు

పని వత్తిడిలో చురుకుగా ఉండాలన్న తలంపు

అంతలోనే తోటి స్నేహితుడి నుండి బయటకు పిలుపు

వెనువెంటనే ఆ”పని” కొరకు తడుతుంది మది తలుపు

ఆ కొద్ది క్షణాలు నిగ్రహించుకోలేని ఓర్పు

ఆస్వాదిస్తూ అంబరినంటే విరజిమ్మిన ఆ తెలుపు

కాయమును కాటికి తీసికెల్లేటి ఆకారు నలుపు

కాలగమనంలో ఒక్కో అవయవం రూపు మాపు

పని కాగానె అదో తీయనైన అలుపు

ఇది నీ జీవనగమనంలో నీకు తెలియని మలుపు

పిదప జీవిత విచ్చిన్న దశకు చేరువవుతున్నానేమోనన్న నిట్టూర్పు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆ పై పెదవి విరుపు

నేటికైననూ మించినది లేదు చివరకు

కావాలి కనువిప్పు ..కనుమరుగవ్వాలి ఆ తప్పు

నీకు నీవే నీకై ఇచ్చుకునే తీర్పు ..రావాలి నీలో మార్పు..

విరమించు ధూమపానం.. విహరించు ఇక స్వర్గధామం