22, అక్టోబర్ 2015, గురువారం

ఆడువారం!


---------------------దూరమవుతున్న ఆడతనం...--------------


పరదేశపు ధరణిలో డాలర్ నడిపించే దారిలో

పరుగులిడుతున్న  ప్రవాస పడతులం 

కట్టు బొట్టును పక్కనబెట్టిన చక్కని చుక్కలం

కట్టుబాట్లకు కాలి మెట్టెలకు మంగళం పాడిన మగువలం 

పసుపు తాడుకు పలుపు తాడుకు అంతరంఎరుగని ఇంతులం

మెచ్చిన మగనితో నచ్చిన నగల కొరకు వగలు పోయే పోరీలం 

అత్త ఆరళ్ళను ఆడ పడుచు వత్తిళ్ళను తావివ్వని తారామణులం  

పండగ పబ్బాలకు తిలోదకాలిచ్చిన సులోచనా తిలోత్తములం

వింతపోకడల చెంత చేరుతున్న నెలవంక నెచ్చెలులం

నడి మంత్రపు సిరితో మిడిసిపడే గడుసు నారీ మణులం 

వెరసి పాశ్చ్తాత్య  మోజులో దూరమవుతున్న ఆడతనం భారమవుతున్న భారతీయం !


15, సెప్టెంబర్ 2015, మంగళవారం

నీ వంటలు నీవి -పాటకు పేరడీ


నీ వంటలు నీవి ఎవరునూ అవి మెచ్చరుగా..
నీ కూరలు నీవి ఎవరికీ అవి నచ్చవుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో తప్పదులే అని తింటుందా?
కన్నోడే విసుగుతొ కడుపు మండి తిడుతుంటే
ముసి ముసి నవ్వుతో కడుపు నిండేనని తలచావా…
వంటంటే అతి సులువా నీ వంటలు ఇక మారవా….ఓ……

రుచి ఉండని రూపుండని వంటల్ని వండేవు
వద్దన్నా  వడ్డించి హింసించి చంపేవు
పగలంత పొగ రేపుతు పగబట్టి వండేవు
నడి రాతిరి రుచి చూడని కొత్త వంటను నెట్టేవు
వంటేదొ తగలెట్టింది నాకొణుకేమో పుట్టింది
రుచి చూడంటూనె కొసరి కొసరి తను తినిపిస్తూనె ఉంది
ఇక బతుకె నరకంలా..కనికరమే నీకు లేదా….ఓ…

పదహారాణాల వయసు !


పదహారాణాల వయసు ఉరవడిలోన


పడుచు గుమ్మాన హరిణి అడుగిడిన తరుణాన 


నింగిని చేరుకోవాలని వడివడిగా అడుగులేయక


నేలనంటిఉన్న మాతృమూర్తులను విడివడక


జీవితపు లయ ఎరిగి ఎక్కడ ఆగాలో ఎక్కడ ఎగరాలో తెలుసుకుంటేనే

జీవితపు అర్థం పరమార్థం తెలుస్తాయి..

ఇపుడిపుడే ఎదుగుతున్న నీ చిన్న మనసుకు ఈ పెద్ద మాటల అర్థం 


నీ ఆశల తీరానికి చేరుకొనేలోగా తెలుస్తుంది… జీవితం సుఖమయమవుతుంది !

ఆ రోజు !

వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఆ రోజు మొదలు


నవదంపతులుగా నలుదిక్కులు మాతో నడచిన రోజులెన్నో!


పంచ భూతాలా సాక్షిగా జీవిత పల్లకి ఎక్కిన ఆ రోజు మొదలు


ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేలా వినుతించిన  రోజులెన్నో!


శ్రీరస్తు శుభమస్తు అని శ్రీకారం చుట్టిన ఆ రోజు మొదలు


ఆలు మగలుగ తోడు నీడగా ఆనందాన్ని చవి చూసిన రోజులెన్నో!


ఆణి ముత్యాలు తలంబ్రాలుగ శిరమున కరములతో తడిసిన ఆ రోజు మొదలు


గడచిన మనుగడలో నిలిచిన మధుర జ్ఞాపకాలెన్నో !


అజన్మాంతం తోడుగా  కలసి ఉంటామని ప్రతిన బూనిన ఆ రోజు మొదలు 


దశాబ్ధకాలంలోనే శతాబ్ధానికి సరిపడ తీపి జ్ఞాపకాలు ఎన్నో ..మరెన్నెన్నో... 

మాయమై పొతున్నదమ్మ -తెలుగుదనము


మాయమై పొతున్నదమ్మ పాటకు పేరడీ..
మాయమై పొతున్నదమ్మ మన తెలుగుదనము
రాయడమే మరచె నేడు రతనాల మన తెలుగు పదము
దేశ భాషలు నందు తెలుగు లెస్సని పల్కి 
దేశ దేశాన వెలిగె వెలుగంటి తెలుగు……..”మాయమై

ఆంధ్ర భోజుడి అష్ట దిగ్గజపు కవులతో అలరించె నాటి తెలుగందం  
నన్నయ తిక్కన ఎర్రన రచియించి అందించె తెలుగు మహా భారతం
గురజాడ శ్రీ శ్రీలు ఆంధ్రీకరించిన
అచ్చ తెనుగు మాట అంధకారితమయ్యె  ….. “మాయమై పొతున్నదమ్మ

డాలర్ల మోజులో పరభాష నోములో (ఫోజుతో) తెలుగుకే తెగులొచ్చెనమ్మా..
పరభాష విసిరిన పంజాకు తల ఒగ్గి తన ఉనికి గతి తప్పెనమ్మా..
ప్రతి ఇంట ప్రతి నోట ప్రతి ఒక్క బిడ్డకి
భాష నేర్పించండి తెలుగు బ్రతికించండి……“మాయమై పొతున్నదమ్మ
 


 

వారధి !


కరతాళ ధ్వనులే తెరచాప రణితములై శరవేగంతో దూసుకెల్తుంటే

అనుకోలేదు ఏనాడు  విధి ఇంతలా ఆడుకుంటుందని!

దాతల వదాన్యతయే దేవ దూతల ఆశిస్సులుగా దీవిస్తుంటే

అనుకోలేదు ఏనాడు  శ్రమించిన వారికి వారధి రిక్తహస్తాలు మిగిలిస్తుందని!

చప్పట్లు కొట్టి శభాష్ అన్న చేతులే తెర వెనుక పావులు కదిపితే

నమ్మలేదు ఏనాడు తాగిన తల్లిపాల రొమ్మునే గుద్దుతారని!

ఆరమరికలు లేకుండా తన మన భేదాలు చూపకుండా వ్యక్తీకరిస్తే

అనుకోలేదు ఏనాడు  ఇంతటి కరడుగట్టిన కక్షిదారులుంటారని!

వారధీ!...ఇలాగే చూస్తూ ఉండు

కరుణ వర్షించిన నయనాలే అగ్ని కణికలు కురిపిస్తాయని..

చిరునవ్వులు చిందించిన అధరాలే  అధముల పాలిటి ఆయుధాలవుతాయని..

నిష్పక్షపాతానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన నీ కరములే  శత్రువుల పాలిటీ శరములై మన అందరికి వరములై

తరాలకు తరగని యశములతో నిలిచిపోతుందని

వెలిగిపో వారధి ...తరిమికొట్టువారిని

నేస్తమా!

కొన్ని పూలు వాడిపోయినా అవి దేవుని సన్నిధి వీడవు
కొన్ని పరిచయాలు కరిగిపోయినా వారి స్నేహ హస్తం వీడరు
జీవితపు ఏదో ఒక మలుపులో వారి జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి !
నేస్తమాచిగురించిన స్నేహం చితి వరకు నీ తోడై ఉండే ప్రాణం ..అదే స్నేహశీలి తత్వం