27, ఫిబ్రవరి 2017, సోమవారం

నాన్న!


తొలిపలుకుల తళుకుల్లో పెదవులపై విరబూసిన రెండొ పదం.

బుడి బుడి నడకల తడబడే అడుగుల్లో వేలు పట్టి నడిపించే మూడో పాదం.

ఆదమరచే నిదురలో బెదిరిన ప్రతిసారి తన గుండెలపై శయనింపే విరి తల్పం

ఆడే ఆటల్లో గుర్రమై నేర్పే విద్యలో గురువై 

పాడే పాటల్లో స్వరమై పంచే ప్రేమలో నరమై

 పరిశ్రమించే శ్రామికుడై

విశ్రమించని సైనికుడై

బంధాల పూదోట తోటమాలియై

పరివార గుడికి పూజారియై

నిలిచే బంధాలకు నిలువెత్తు సాక్షాత్కారమై,నిలువ నీడకు విలువలద్దిన బొధి వృక్షమై,

బరువు ,బాధ్యతకు ఓ సరళ నిర్వచనంలా నిలిచే నాన్న నిత్యం ఒంటరివాడే..!

మందలించిన అమ్మను కాదని తన నిరసనను

కఠినంగా ప్రదర్శించినా ప్రతిఘటించలేని చనువే నాన్న!

కనిపించని స్వర్గం, కనిపెంచిన అమ్మ పాదాల చెంత ఉంటే

ఆ స్వర్గం,సమస్త భువనాలు నాన్న పాదాల దాస్యం అని చరిత్ర తెలిపే ఓ నగ్న సత్యం!

నీకోసం నిరంతరం శ్రమించి అలసిన ఆ నాన్న కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? వారి పాద పద్మముల కడ సేద దీరడం తప్ప..!

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

కుల మతాలు


కుల మతాలు పెచ్చరిల్లడం సమ సమాజ నిర్మాణానికి విఘాతం

 

కులమతాలు మల మూత్రాలతో పోల్చతగ్గ పరిణామం

 

కులమతాలు విడనాడడం దేశానికి శ్రేయస్కరం

 

మల మూత్రాలు విసర్జించడం దేహానికి ఆరోగ్యకరం

 

మనిషిగా మానలేమా మతోన్మాద వివక్ష ధోరణులు?

 

మానవుడిగా నివారించలేమా కులాల కుమ్ములాటలు?

 

సగటు జీవిగా సవరించలేమా వర్గాల వైషమ్యాలను?

 

దూర దూర తీరాలకు చేరువైనా భారమైన బతుకులతో సతమతమవుతున్నా

 

సాటి మనిషికి సహాయపడని వ్యర్థ కుల మత విద్వేషాలెందుకు మనకు?

 

పంచభూతాలకు లేని కుల మతాలు వాటిని ఉపయోగించుకునే మనకెందుకకు?

 

ఒక్కసారి ఎదుటివాడికి స్నేహహస్తాన్ని అందించి చూడు

 

మసకబారుతున్న మానవ బంధాలు ఎంత బలపడతాయో?

 

ఒక్కసారి ఎదుటివాడిని చిరునవ్వుతో పలకరించి చూడు

 

శిధిలమై పోతున్న స్నేహబంధాలు ఎలా గట్టిపడతాయో?

 

కులమంటే మనలోని కుళ్ళుయని మతమంటే మనలోని మాయని గుర్తించు

 

కాటికి కాలు చాపినపుడు  కనులు తెరుచుకోకముందే

 

బంధాలలోని పరిమళాలు ఆస్వాదించు..ఫలితాలు  అనుభవించు..నేటినుండే!

ప్రవాసులారా!

నీరుగార్చే నిబంధనల నిట్టూర్పుల సెగల తాకిడికి 


కుదేలవుతున ప్రవాసులారా! 


నారు పోసిన వాడు నీరు పోయక మానడు అన్నది నీవెరుగవా? 


నారు నీరు నోరు ఉంటే రాజ్యంలో ఉన్నా ఒక్కటే అన్న సత్యం కాదనగలవా..? 


నాలుక ఉన్నోడు నలు దిక్కులు తిరుగగలడు. 


పదును ఉన్నోడు దిక్కులన్నీ ఒక్కటి చేయగలడు  


సుదూర తీరాలలో అనుక్షణం భయం గుప్పిట్లో సాగే మనుగడకంటే 


ఉన్న వూరులో కన్నవారి చెంత సాగించే నీ పయనం సౌఖ్యం కాదా..? 


ట్రంపు గుంపు రేపే కంపు స్లంపులో మనసు చంపుకుంటూ కట్టు బానిసలా బతకాలా..? 


కంపునే మన ఇంపుగా తలవని తలంపుగా మలుచుకొని స్థానికంగా బతకాలా? 


స్వేదం చిందించి కండ బలం కరిగించి రుధిరం మరిగించి జీవన యానం సాగిద్దాం..
నిండు భారతీయుడిగా దేశం మీసం తిప్పుదాం ,భరతమాత చరణాల వద్దే మా జీవితం అని సగర్వంగా చాటుదాం !