తడి ఙ్జాపకాలు తట్టిలేపుతుంటే ఆగనంది నా కలం
రాలుతున్న పూలు రోదిస్తుంటే రాయమంది ఓ కవనం
మస్తిష్కాన్ని కుదిపేస్తే
కదిపింది పదాల మది గ్రంధం
వసంతపు గుమ్మంలో రంగులీనిన పువ్వులే ఆ జ్ఞాపకాల కు పునాదులై
అరుణిమ అందాలతో తరుణిల మనసు దోచిన కుసుమాలు కదా అవి
గాలి కూడా వాటిని
అంతే సుతారాంగా ఊయలూపుతుందనుకుంటాం
కానీ గాలే ఒక్కోసారి
పట్టి ఊపేస్తుంది
ఆకులు తోబుట్టువులు
కవచాలై నిలువరించినా
అప్పుడె ప్రాణంపోసుకుంటున్న లేత చిగురులూ నివారించినా
కసిరి కొట్టే విసురు గాలి ధాటి కి మాత్రం
నిర్ధాక్షణ్యంగా విసిరి వేయబడతాయి
నేల రాలిన పూల గొంతుకపై కూడా వేల జీవులు కఠినంగా కవాతు చేస్తాయి
దారులపై బారులుగా పడ్డ పూబాలల
గుండెలపై కారులు మొండి దాడిని ముమ్మరం చేస్తాయి
తల్లి చెట్టు విలపిస్తున్నా
కొమ్మలన్నీ రోదిస్తున్నా
ఆపలేవు పూల మరణం
చేరలేవు దేవుడి చరణం
నీడ నిచ్చే వృక్షానికి నిండు నూరేళ్ళ ఆయుషు నొసగిన బ్రహ్మ..
పుట్టిన పది రోజులకే చెట్ల పుత్రికలను నేలరాల్చుట న్యాయమా..?