21, ఫిబ్రవరి 2023, మంగళవారం

అంతరంగం ...

 అంతరంగం ...


అందంగా ముస్తాబు చేసి అంగట్లో పెడితే ..

అలంకరణ కోసం కాబోలు .. అని  గర్వపడ్డా ..

అద్దాల గదిలో మువ్వురం ఇరుక్కుని 

ఊసుపోని కబుర్లలో ఉక్కిరి బిక్కిరవుతున్నాం ..

అంతలోనే కిడ్నాప్ చేస్తున్నారేమో అనేంతగా 

అమాంతం అరచేత్తో ఒడిసిపట్టుకొని ఆరుబయటికి అరుదెంచారు ఎవ్వరో ..

కారులో షికారుకు తీసుకొచ్చారులే అని 

సంబరపడ్డాం ..

క్షణమాలస్యం ..మా గది తలుపులు తెరిచారు .. అంతే 

ఒక్కసారిగా రెక్కలొచ్చీ గువ్వలా ఎగిరి దుమికాము .. 

పరిసరాల పచ్చని చెట్లు పలకరించినట్టు 

పిల్ల తెమ్మెర నాదాల పిలుపులతో పులకరించినట్టు 

మా ఆనందం ఆకాశాన్నంటేలోగా ..

ఏదోసుతిమెత్తగా తాకింది ..తోశారా అని అనుకొనేంతలో ..ఎగిరి అటుపడ్డా ..

అటుపక్కనుండి మల్లీ గట్టిగా ఎవరో వీపుపై చరిచినట్టు ఉలిక్కిపడ్డా ..అంతే 

ఇటువైపు నుండి మరింత కసిగా మరొకడు ..

అంతకంటే బలంగా ఇంకోడి బాదుడు ..

ఒకడేమో గింగిరాలు తిప్పడం 

మరొకడు ఊచకోతనే నయమన్నట్టు కోయడం ..

ఇలా ఎడా పెడా అటూఇటూ  కొడుతుంటే ...ఆడుకుంటుంటే .. 

అప్పుడర్థమైంది ..

మా అయువు ఈ ఆటగాళ్ళు అనుకొనే వేటగాళ్ళ చేతిలో మూడిందని ..

నాతోటి సోదరులకు కూడా ఈ ముప్పు తప్పదని ..

కొన్ని ఘడియలకు నీరసంగా కొన ఊపిరితో ఉన్న మమ్మల్ని .. 

చెత్త బుట్టలో వేయడంతో మా ప్రాణాలు .. అలా గాలిలో ..కలిసిపోయాయి 

ఇకపై వద్దు ఈ బంతి జన్మ ..ముద్దు ఆటగాడి జన్మ  

మీ 

🎾

కామెంట్‌లు లేవు: