22, జులై 2011, శుక్రవారం

యువనేత..!

కడప ఎన్నికల సంధర్భంగా అప్పట్లో రాసిన పదాల సమూహం ఈ కవిత..

ఎదురు లేదు మనవాడికి బెదురు లేదు తనవారికి
కుదురు లేదు పగవారికి ముదురు కాడు రాజకీయాలకి
ఒంటరివాడు అధిష్ఠానానికి..అందరివాడు ఆంధ్రావారికి
మాట తప్పడు ఇచ్చిన మాటకి..మడమ తిప్పడు అడిగిన దానికి
వెన్ను చూపడు వైరి వర్గానికి..వెనుకంజ లేదు కాలు దువ్వడానికి
ఎదురొడ్డి నిలిచాడు ఎలక్షన్లకి.. కడప రెడ్డి కదిలాడు వోట్ల కలెక్షన్లకి
చుట్టూముట్టిన మంత్రివర్యులందరికి.. ముచ్చెమటలు పట్టె వై యెస్ ధాటికి
సినీ గ్లామరు చిరుకి.. చింతకాయలు రాలవని తెలియజెప్పె చివరికి
వారి నోట్ల కట్టల మూటలకి.. వోట్లు వేసె మన యువనేత మాటలకి..
బీరాలు పలికిన హీరోల డప్పుకి.. వరాలు గుప్పించిన గారాల విదేశీకి,
వివేకమడుగంటిన బంధు రాబందుకి..బృహన్నలను మరిపించిన రవీంద్రుడికి..
గుణపాఠం ఈ కడప తీరుకి , కడపటి తీర్పుకి ..

21, జులై 2011, గురువారం

నేనే నీవైతే..

నడి వంపుల నడయాడు నిండు గోదారి నీవైతే..
నిను నాలో కలుపుకొనే కడలి కెరటమవుతా..
ఉవ్వెత్తున ఎగసిపడే అలల సవ్వడి నీవైతే..
ఎలుగెత్తి చాటే నడిసంద్రపు హోరు నవుతా..
కారు చీకట్లు కమ్మిన మబ్బుల్లో దీపం నీవైతే..
దీపం చుట్టూ ముసిరిన మిణుగురు పురుగును అవుతా..
నిండు చల్లని పున్నమి జాబిలి నీవైతే..
పిండి ఆరబోసిన పండు వెన్నెల నేనవుతా.
నల్లని కురుల సొగసు వాలు జడ నీవైతే..
జడన తురిమిన జాజి పువ్వును నేనవుతా ..
అందెలు విసిరిన మువ్వల సందడి నీవైతే..
కందిన నీ కాలి సిరి మువ్వ గజ్జెనవుతా ..
పారే సెలయేటిన పాడే పాటవు నీవైతే..
పాటలోని పదముగా ఒదిగి పొదిగే అక్షరమవుతా..
ప్రపంచాన్ని సృష్టించే ప్రకృతి నీవైతే..
ప్రకృతికి ఊపిరినిచ్చే నీ ఆయువు శ్వాసనవుతా..

-- చంద్ర