22, ఫిబ్రవరి 2023, బుధవారం

చెప్పనా..?

 ఏమని చెప్పను ఎన్నని చెప్పను..?

మన freshers day  రోజున అనుకోకుండా వేసిన కిటుకులు తెలిసిన చిటపట చినుకుల పాట చిందులకు వచ్చిన చప్పట్ల మోత గురించి చెప్పనా.. ?

అమరావతి పర్యటనలో ఆహ్లాదంగా గడచిన ఆ మధురానుభూతుల మాధుర్యాల గురించి చెప్పనా..?

హాస్టల్లో చిరు పాట చిత్రలహరిలొ రాగానె చిందేసిన గెంతుల గురించి చెప్పనా..?

చంద్ర కళ ఈ చంద్ర చెల్లికి కొన్న నైటీ సహకారపు ఆనవాల్లు చెప్పనా..?

general quiz లో  మొదటి బహుమతి సాధించిన విజయ దరహాసాల  vizag trip గురించి చెప్పనా..?

మొదటిసారి జీవితంలో Fail అన్న పదాన్ని పరిచయం చేసిన EM Subject గురించి చెప్పనా..??

BSN reDDi class లో బిక్కు బిక్కు మంటూ బిత్తరపోయిన సంఘటనలు గురించి చెప్పనా..?

దొంగ చాటుగా గోడ దూకి విజయలక్ష్మి థియేటర్లో చూసిన second shows  గురించి చెప్పనా..?

చంద్ర మౌళీ గారు చెప్పే అంతరిక్షపు గ్రహాల్లో నే వూహించుకున్న నా స్వప్న సుందరి గురించి చెప్పనా..?

College Annual Day కు చిరు పాటకు Stage మీద అడుగుపెట్టి లయబద్దంగా వేస్తున్న అడుగులు అర్థాంతంగా ఆగిపోయి రెచ్చిపోయిన కుల విషనాగుల కాట్లకు ఈ కాటుబోయిన ఎంతలా వ్యధ చెందాడొ చెప్పనా..?

వీడ్కోలు వేదనలో విడవలేక స్నేహితులను కార్చిన కన్నీటి కథ చెప్పనా..?

చివరగా...ఒక్కమాట..

కుల కౌగిట్లో నలిగిన నా సహ విద్యార్థుల  వేదన గురించి ఈ ఒక్క వాక్యంలో నే చెప్పగలనా? 

వదిలితే వందపేజీలు నిరాఘాటంగా రాసి ఆ క్షుద్రమూకల దౌర్జన్యాలను,వారి ఆగడాలను ఓ మహా కావ్యంగా వేయి పడగలా కాకున్నా ఓ వంద పడగలా అయినా రాయగలనని ..మీ

-చంద్ర కాటుబోయిన  




ఆటా పాటా అన్నిట్లో మేటీనే ..

బరిలో దిగితే లేడెవరూ పోటీనే ..

మాటా మాటా కలిపాడంటే 

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల

నీ పేరేందో దెలువది

నీ ఊరెందో దెలువది

నువ్ యేడుంటవో దెలువది

నువ్ ఎట్లుంటవో దెలువది

ఐనా నా ఎద సాటు

నీ బొమ్మే గీసుకున్న

నీ పేరే రాసుకున్న

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల


నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన

అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన

నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన

అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన

ఎక్కడనా చేతినుంచి జారిపోతవో అని

గుబులైతాందే గుండె బరువైతాందే

పరిసానైతాందే పాణమెళ్లి పోతాందే



నిన్ను తెలియగ నెంచి

నన్ను నేను మరిసిన

అంతట నిన్ను గాంచిన

అందరి మంచి గోరిన 


ఎప్పుడు ఈ గ్యానం నా మతిలో నిలిచేలా

నిండి పోరాదే

నా గుండెల ఉండి పోరాదే

చివరకు నేనే నువ్వై మిగిలి పోవాలే


21, ఫిబ్రవరి 2023, మంగళవారం

అంతరంగం ...

 అంతరంగం ...


అందంగా ముస్తాబు చేసి అంగట్లో పెడితే ..

అలంకరణ కోసం కాబోలు .. అని  గర్వపడ్డా ..

అద్దాల గదిలో మువ్వురం ఇరుక్కుని 

ఊసుపోని కబుర్లలో ఉక్కిరి బిక్కిరవుతున్నాం ..

అంతలోనే కిడ్నాప్ చేస్తున్నారేమో అనేంతగా 

అమాంతం అరచేత్తో ఒడిసిపట్టుకొని ఆరుబయటికి అరుదెంచారు ఎవ్వరో ..

కారులో షికారుకు తీసుకొచ్చారులే అని 

సంబరపడ్డాం ..

క్షణమాలస్యం ..మా గది తలుపులు తెరిచారు .. అంతే 

ఒక్కసారిగా రెక్కలొచ్చీ గువ్వలా ఎగిరి దుమికాము .. 

పరిసరాల పచ్చని చెట్లు పలకరించినట్టు 

పిల్ల తెమ్మెర నాదాల పిలుపులతో పులకరించినట్టు 

మా ఆనందం ఆకాశాన్నంటేలోగా ..

ఏదోసుతిమెత్తగా తాకింది ..తోశారా అని అనుకొనేంతలో ..ఎగిరి అటుపడ్డా ..

అటుపక్కనుండి మల్లీ గట్టిగా ఎవరో వీపుపై చరిచినట్టు ఉలిక్కిపడ్డా ..అంతే 

ఇటువైపు నుండి మరింత కసిగా మరొకడు ..

అంతకంటే బలంగా ఇంకోడి బాదుడు ..

ఒకడేమో గింగిరాలు తిప్పడం 

మరొకడు ఊచకోతనే నయమన్నట్టు కోయడం ..

ఇలా ఎడా పెడా అటూఇటూ  కొడుతుంటే ...ఆడుకుంటుంటే .. 

అప్పుడర్థమైంది ..

మా అయువు ఈ ఆటగాళ్ళు అనుకొనే వేటగాళ్ళ చేతిలో మూడిందని ..

నాతోటి సోదరులకు కూడా ఈ ముప్పు తప్పదని ..

కొన్ని ఘడియలకు నీరసంగా కొన ఊపిరితో ఉన్న మమ్మల్ని .. 

చెత్త బుట్టలో వేయడంతో మా ప్రాణాలు .. అలా గాలిలో ..కలిసిపోయాయి 

ఇకపై వద్దు ఈ బంతి జన్మ ..ముద్దు ఆటగాడి జన్మ  

మీ 

🎾

నటశేఖరా .. ! నివాళి 🙏🏻

 ధైర్యం మూగబోయింది...

సాహసం కన్ను మూసింది..

ఉదారతకు ఊపిరాగింది..

తేనె మనసులతో తెలుగు వీర లేవరా అంటు తెలుగు వారి గుండె తట్టిన మగధీరా ..

లవ్ బాయ్ , గూడ్ బాయ్ లాంటి మూస పాత్రలకు చరమగీతం పాడిన కౌబాయ్ గా ..

తెలుగు నిర్మాతల పాలిటి కల్పతరువుగా 

జనాదరణలో అసాధారణ ఆంధ్రా జేమ్సు బాండ్ గా ..

సినీ జగత్తులో విప్లవాత్మక సాంకేతికతకు చిరునామాగా ..

తెలుగు చలన చిత్ర సిం హసనం పై తెగువ కల్గిన బుర్రి పాలెం కుర్రోడుగా ..

తెలుగు కళామతల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్న నటశేఖరా .. 

అశ్రువులు బాసిన నయనాలతో .. భావోద్వేగాలు నిలువెల్లా దహించుకుపోయే దోసిల్లతో అర్పిస్తూ ఇదే ఘట్టమనేనికి ఘనమైన కన్నీటి నివాళి 🙏🏻

Naalo nenu

 

మునుపెన్నడూ హృదయం ఇంతగా ద్రవించనే లేదు 

కనులెప్పుడూ ఇంతగా వర్షించనూ లేదు 

తనువెన్నడూ ఇలా తల్లడిల్లిందీ లేదు 

ఇంతలా ఎందుకనో ..? 

మాటలేమో ..

     మంచులో కూడా సెగలు రగిల్చే తూటాలు 

     కంచు స్వరాన నరాలు తెంపే కరుకైన చుర కత్తులు 

     అణచలేని ఆవేశాన వివేకమడుగంటి విసిరే పిడి బాకులు

      ఎందరున్నా ఎదుటివాడి గుండెల్లో గుచ్చే గునపాలు 

మరి మనసెందుకిలా ..

   పొరుగింటి తల్లి కన్నీరు మున్నీరవుతున్నా ..

   అప్పగింతల వేల ఆడబిడ్డ శోకాలు పెడుతున్నా ..

    అప్పుడే పుట్టిన పసికందు వెక్కి వెక్కి ఏడుస్తున్నా ..

     కట్టుకున్న అమాయక చిన్నది  కంట తడి కాంచినా .. 

నిలువెల్లా కరిగిపోతా 

తలుపుల్లో మరిగిపోతా 

కన్నీటి కడలిలో జారిపోతా .

కడకు చిత్రంగా ....

 ఏ చిత్రమందైనా చీమంత చింతనా భరిత సన్నివేశమందును 

అంతులేని నిర్వేదానికి లోనవుతా  

కన్నీటి ధారలలో తడిసి బయటికి కనపడనీయని తుఫానులో సమిధనవుతా ..

వెరసి నాదైన సమాజాన కదలిపోతా కలసిపోతా .. 

-చంద్ర

Tennis-Beauty

 కను చూపు మేరలో .. కళ్ళకు కట్టినట్టు ..

అందమైన బంతాటలో ఆనందాలు విరబూసినట్టు 

కొట్టే ప్రతి షాటుతో కోరికలు చెలరేగేట్టు 

టెన్నిస్ ఆటతో వసంతాలు వచ్చినట్టు 

పున్నమి వెన్నెల ఆటలో పూనకాలొచ్చినట్టు 

ఆడే మన ఆటలో ఆనందాల అంచులను తాకినట్టు .. 

ఏమిటీ ఆట కనికట్టు .. ఎప్పుడీ ఆట కట్టు ? 

ఈ ఆట కనిపెట్టిన ఓ బ్రహ్మ .. ధన్యమైంది మా జన్మ 🙏🏻

Federer -Fever-Retirement

 ఏ మాయ చేశావో ..

ఏ మంత్రం వేశావో ..

అంతవరకూ ఆ ఆట ఒకటుందని మాత్రమే తెలుసు ..కానీ 

నీవల్ల ఆ ఆటకే అందం తెచ్చావ్,

తెలియని మోహం పెంచావ్,

తీరని దాహం తీర్చ్చావ్ వెరసి 

ఆ ఆటకే వన్నె తెచ్చావ్ ..

నీ చేతిలో ఆ రాకెట్ మరో మంత్రదండం కాదుగా..? మరి అలా ఎలా అడగలిగావ్ .. ?

ఆ బంతి నువ్ చెప్పినట్టే అలా వింటుందేంటి ? 

అదేదో వేసిన ఆ రేఖలనే వెంటాడుతున్నట్టు..

ఓహ్..వశీకరణ మంత్రం ఏదైనా తెలిసేమో..నీకు..

మరి..ఆ సర్వ్? ' టీ ' ప్రియురాలు కాబోలు .. ఎప్పుడూ అక్కడే పడతానంటది.. 

ఆ డ్రాప్స్ ..సంగతేంటి ..? ఇప్పటికీ ఇంత పదును ఎవ్వరూ చూపలేరనేగా వాటి మిడిసిపాటు ?

ఆ ఎదుటివాడి మీద కాసింత కనికరం కూడా చూపవా..? 

మరిచిపోయా .. ఆ బ్యాక్ హ్యాండ్ ఏంటయ్యా ..? 

అదేదో మయుడే  శిల్పం చెక్కినట్టు , 

అర్జునుడు బాణాన్ని సంధించినట్టు , 

నయనతారే బంతిలా మారి ప్రత్యర్థికి సెగలు రగిలించేట్టు .. ఏంటా ఆ ఆట ..? 

పవర్ గేమొచ్చినా .. రాడిక్ రచ్చజేసినా 

సఫిన్ సందడి చేసినా , నాదల్ నాటుగున్నా , జోకర్ విరుచుకు పడినా ..

నీ ఆట సొగసు ముందు నిలువతరమా..? 

అసలు .. అంత హోరాహోరి పోటీలలో తడిసి ముద్దయ్యే ఆటగాళ్ళు ఎందరో .. మరి .. నీ ఆట ఏంటయ్యా.. 

అపుడే ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకునట్టు .. ఆది నుండి అంతం వరకు నీ మడతలు చెరగవ్ , నవ్వులు చెదరవ్ .. ఇలా ఎలా ?

స్విస్ నాణెము పై కూడా హడావిడి చేస్తున్నవంట..ఈ జగతిలో  అలా నీలా బతికున్నపుడే ఎవరెస్టు స్థాయి ఎవరెదిగారులే..

ఏదేమైనా .. మా మనసులలో చెరగని ముద్ర వేశావ్ ..ఇంతలా అలరించిన ఆటగాడు ఇకపై ఆడబోడని తెలిసి మా కనులను తడిపావ్ ..

చివరగా ..ఒక జీవిత కాలానికి 

టెన్నిస్ ఆటకే ప్రతీకగా నిలిచావ్ .. 

All the best federer .. never relieve your fever🙏🏻

కొత్త సంవత్సర శుభాకాంక్షలతో.. 2023

 


ఎన్నో ఏళ్ళుగా చూస్తూనే ఉన్నా 

అయినా ..తన ముస్తాబుని చూసి ఒకింత అచ్చెరు వొందక మానదు

అలా...వెలుగు రెక్కలను తొడుక్కుని  

నిలువెల్లా కాంతి పుంజాలు పులుముకొని 

అభేద్య సంద్రాల మీదుగా సంతోషాలను నింపుకొని 

ఆశల పల్లకీలో ఆశయాల సాధనకు ఉపక్రమిస్తూనే ఉంది.

తుషార సమీరాలను స్పృశిస్తూ ఉషోదయా తిమిరాలను నిరసిస్తూ

పంచ కళ్యాణి వేగంతోటి విశ్వమంతా భ్రమిస్తూనే ఉంది. 

ప్రతి ఇంటిల్లిపాది గుమ్మం తడుతుంది.

ప్రతి కంటి తడిని తుడుస్తుంది . 

ఆరుగాలం ఆనందాలను ఇనుమడింప జేస్తుంది 

సకల జనులకు సముచిత స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరం మన జీవితాల్లో తొంగిజూడాలని.. 

-కొత్త సంవత్సర శుభాకాంక్షలతో.. 


చంద్ర కాటుబోయిన

చిరు..

చిరుగాలిలా వస్తా!

చిరునామా తెలిపితే

చిరకాలం వేచియుంటా!

చిర్రు బుర్రు లాడితే

చిరంజీవినై సాధిస్తా

చిరాకు పరాకు పడితే

చీర కొత్తది కొనీపెడతా!


Hussein-Dips mate Hardwork

 అలనాడు

యవ్వనపు పొలిమేరలు దాటుతున్న సమయాన

హృదయ కంపనలకు భాష్యం తెలియని తరుణాన

తనలో మెరిసిన మెరుపు తాలూకు భావాలకు అర్థం వెతికా.

మట్టిలో పుట్టిన మాణిక్యమనో ..బురద నుండి జనించిన తామరయనో

మిడిసిపడే దీపాల చదువరుల నడుమ  మిణుగురులా చేరి

కన్నీటిపొరల్లో కష్టాలని దాచుకొని

గుండెలచాటున ఆకలిని చంపుకొని

ఎండమావులలాటి గమ్యానికై

చీకట్లో దారులు వెతుకుతూ

నింగే హద్దుగ విద్యే ముద్దుగా

నిదుర తన నిదుర మరిచేలా

స్వేదము చిందించిన సేద్యగాడు ...

New Year -2021

 అంతవరకూ నీరెండ మాటున మౌనాన్ని ఆశ్రయించిన

శిశిరపు గాలులు రెక్కలు విదిల్చిన వేళ  ..

సాయం సంధ్యపు సంజ చీకట్లు ముసురుకొనేవేళ ...

దశాబ్దపు ఆఖరి గడియల వేడుకలకు

శ్వేత సౌధము వేదికైన వేళ ...........

అదిరే రుచులతో అతివలు ఆరగించగా 

మకరందపు మధువులు సేవింప తుమ్మెదలు చేరగా

సంగీత ఝరిలో యవ్వన గీతికలు పల్లవించగా

ఓపలేని ఊపున ఆపలేని నృత్యాలు కదం తొక్కగా

జంటల నృత్యం జనుల కనుపంటగా

అందరి చిందులు అందలం తాకగా

నడిరేయి జాముకి వడి వడిగా పరుగులు తీయగా

దిక్కులు పిక్కటిల్లేలా మేఘాలు గర్జించేలా

"హ్యాపీ న్యు ఈయర్ " అన్న నాదం ప్రతిధ్వనించింది 

కొంగొత్త దశాబ్దానికి  పునాది వేసింది ..

ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో...


చంద్ర కాటుబోయిన ..

Engg-Friends-Reunion

 

పాతికేళ్ళుగా విడివడిన స్నేహ పరిమళాలు 

వసంతం రాకమునుపే విరిసిన వింత సౌరభాలు 

కలకాలం మదినిండుగ పదిలపరుచుకున్న జ్ణాపకాలు 

రెక్కలు తొడిగి మళ్ళీ చిగురిస్తూ ఆహ్వానిస్తున్న సంతకాలు 

యవ్వన లోగిళ్ళలో పురివిప్పిన చిలిపి సరదాల పరదాలు 

నేటికవి పెదవిపై విరబూసె చిరుదరహాసాలు-Chandra

స్థైర్యం-

 ఇల జగతిలోన సెలయేరులాటి ఓ చల్లని మనసు...

ఆదిలో పిల్ల కాలువలా పరుగులు తీస్తూ

వింతైన ఈ కొత్త లోకాన్ని చూడ గగనాన విహరింప ఊహా ఊయలలకు సిద్దమవుతుంది.

ఆ ప్రవాహానికేమి తెలుసు?

మున్ముందు రాళ్ళు రప్పలు చెట్టూ పుట్టలతో చెట్టాపట్టాలెయ్యాలని..

ఆశనిపాతంలా సుడిగుండాల్లో చిక్కుకుంటూ చిక్కి చిత్రవధ చెందుతానని..

కానీ విధిని సైతం సవాలు చేస్తూ మొక్కవోని స్థైర్యంతో

పక్కనుండి జాలువారే హేమంతపు హిమానీ నదాలే తోడవుతాయని..

ఆ స్నేహ ఉరవళ్ళ పరవళ్ళలో ..ఎదురొచ్చే బండరాళ్ళను

మెడనపడ్డ గుదిబండలను సైతం తన గుండె ధైర్యంతో తొక్కేసుకుంటూ

తనే రహదారి నిర్మించుకుంటూ ఆ సముద్రగర్భాన కలవాలని..

ఏనాటికైన ఆ చల్లని మనసు తన ఊహా తీరాలని చేరాలని..

కోరుకుంటూ..

నా అక్షరాలు..

 నా అక్షరాలు


ఇపుడిపుడే నడకలు నేర్చే
పసితనపు పాపాయిలు

పదే పదే ఏదో చెప్పాలన్న
ఆరాటంలో పరుగులు తీసే
పంచ కళ్యాణీలు 

అరకొర అర్థాలు స్ఫురించినా
ఆర్ద్రతను అమాయకత్వాన్ని
ప్రతిబింబించే అమాయకపు చిత్తరువులు

తెరచిన గుమ్మాల ముంగిట్లో
ప్రాతఃకాలానే దూసుకు వచ్చే 
లేలేత కిరణాలు 

ఝెండా రెపరెపలని

హిమాని సోయగాలని

మట్టి పరిమళాలని

స్పృశించలేని  సునిశిత భావ తరంగాలు

నా అంతరంగాన వీస్తున్న గరిక పరిగలు ..

 

ఏమని చెప్పను ఎన్నని చెప్పను..?

మన freshers day  రోజున అనుకోకుండా వేసిన కిటుకులు తెలిసిన చిటపట చినుకుల పాట చిందులకు వచ్చిన చప్పట్ల మోత గురించి చెప్పనా.. 

అమరావతి పర్యటనలో ఆహ్లాదంగా గడచిన ఆ మధురానుభూతుల మాధుర్యాల గురించి చెప్పనా..

హాస్టల్లో చిరు పాట చిత్రలహరిలొ రాగానె చిందేసిన గెంతుల గురించి చెప్పనా..

చంద్ర కళ ఈ చంద్ర చెల్లికి కొన్న నైటీ సహకారపు ఆనవాల్లు చెప్పనా

general quiz లో  మొదటి బహుమతి సాధించిన విజయ దరహాసాల  vizag trip గురించి చెప్పనా..

మొదటిసారి జీవితంలో Fail అన్న పదాన్ని పరిచయం చేసిన EM Subject గురించి చెప్పనా..

BSN reDDi class లో బిక్కు బిక్కు మంటూ బిత్తరపోయిన సంఘటనలు గురించి చెప్పనా..

దొంగ చాటుగా గోడ దూకి విజయలక్ష్మి థియేటర్లో చూసిన second shows  గురించి చెప్పనా..

చంద్ర మౌళీ గారు చెప్పే అంతరిక్షపు గ్రహాల్లో నే వూహిచుకున్న నా స్వప్న సుందరి గురించి చెప్పనా..

College Annual Day కు చిరు పాటకు Stage మీద అడుగుపెట్టి లయబద్దంగా వేస్తున్న అడుగులు అర్థాంతంగా ఆగిపోయి రెచ్చిపోయిన కుల విషనాగుల

కాట్లకు ఈ కాటుబోయిన ఎంతలా వ్యధ చెందాడొ చెప్పతరమా..

వీడ్కోలు వేదనలో విడవలేక స్నేహితులను కార్చిన కాన్నీటి కథ చెప్పనా..

చివరగా...ఒక్కమాట..

కుల కౌగిట్లో నలిగిన నా సహ విద్యార్థుల  వేదన గురించి ఈ ఒక్క వాక్యంలో చెప్పడం నాకు తగునా...

వదిలితే వందపేజీలు నిరాఘాటంగా రాసి ఆ క్షుద్రమూకల దౌర్జన్యాలను,వారి ఆగడాలను ఓ మహా కావ్యంగా వేయి పడగలా కాకున్నా ఓ వంద పడగలా అయినా రాయగనని ..మీ

చంద్ర కాటుబోయిన  


Sowji-Bday

 నాకంతవరకూ తెలియనేలేదు..

ఓ రంగుల ప్రపంచం నా కన్నులలో దాగుందని..

నే చూడని మరో లోకాన్ని మనోల్లాసంగా ఉరకలేయిస్తుందని..

ఆ లోకాన పంచ వన్నెల రంగులను మించిన

సప్త వర్ణాల వెన్నెల హరివిల్లులలో నా బంగారు ఉదయిస్తుందని..

ఆ మువ్వన్నెల సిరి నవ్వుల్లో ధృవతారలా దరికొస్తుందని..

దొరకని ఆ చంద్రునితో దోబూచులాడుకునే తన లోకమే నాలోకమవుతుందని..

నింగిలోకి తొంగి చూస్తూ లెక్కకు అందని చుక్కలని

ఒక్కొక్కటి తన దోసిల్లలో పొదువుకుంటూ

కనుల కలల అలలపై సయ్యటలూగుతుందని..

ఈ నాన్న గుండెలపై అలానే ఆదమరచి హాయిగా నిదరోతుందని ..

Kavitha on -MD close friends

 నిశ్శబ్ద నిశీధిని దాటుకుంటూ

నల్ల మబ్బుల కారు చీకట్లను

వేగుచుక్కల వెండి కాంతులను

తడుముతూ

తడబడుతూ అడుగెడుతూ

ముళ్ళ కంచెల పచ్చటి ప్రహరీ గోడ

లంఘించిన తరుణాన

సహృదయ సోదర

అన్న దాతకే వన్నెలద్దే శ్రీధర

మానవ మణిపూస రణధీర

గుట్టులెరగని కుట్టు

ఉన్నత భావాల ఉదాత్త మూర్తి

కాలానికొక్కడు కాశీ

నిగర్వి పునాటి

జాతి రత్నం జక్లేటి

వేతనానికి ఊతమిచ్చిన జిగర్ మోడీ

చల్లని కళ్ళ చల్లగుండ్ల

వినయ సంపన్న వీరాంజనేయ

అందరివాడు అనిల్

నిరాడంబరి వెంకట గుట్టం

మిత్రుల పదారేళ్ళ స్నేహ పరిమళాలకు

ప్రణమిల్లుతూ...Chandra

chanduSanjana arangetram..kavitha

 


భానుడి భగ భగలు నివ్వెరపరిచే తరుణాన

అరంగేట్రపు ఆహ్వానపు వేదిక చేరిన క్షణాన

దహించుకునేలా ఉన్న దేహాన ఒక్కసారిగా

చల్లని మంచు పూల తెమ్మెరలు సొకినట్టుగా

స్వర లయ నాదాలతో నర్తిస్తున్న సంజన..

నట్టింట నాడు బుడి బుడి నడకల అడుగులేనా ఈ

గోరింట పాదాల నృత్య సవ్వడులు?

మృదంగం కవ్విస్తున్నా..వీణా గానం నవ్విస్తున్నా

జానకి తాళం మరిపిస్తున్నా జనాల చప్పట్లు మురిపిస్తున్నా..

దేవతార్చన కీర్తనలన్నీ ఈ నాట్య మయూరికోసమే పుట్టినట్టు..

తన కాలి మువ్వలన్నీ ఈ పాదాల కోసమే పుట్టినట్టు

హృద్య వేణు గాన నాట్య పరంపర సాగేకొద్దీ

సంగీత స్వర జతుల పదాలకు సంజన పాదాలకు

మీరా నేనా అన్న రీతిలో పోటాపోటీని సాగించిన ఓ నాట్య మయూరి..

రెప్ప వాల్చని హృదయాలను

చెప్పనలవికాని భావాలను

పొడసూపిన నీ నాట్యమధురిమలకు పరవశించి సాక్షాత్తు ఆ కళామాతల్లే దిగివచ్చి ఈ చొక్కాకు యశమును వెయ్యేళ్ళు వర్ధిల్లేట్టు దీవించుగాక...!


Tennis-Kavitha on friend

 

Small kavitha on Sachi tennis player

అతనో అడ్డుగోడ .. 

తూరుపింట భాను కిరణాలకు సైతం 
తన రాకెట్ ఇవ్వదు జాడ 

చందర్ చెలరేగుతున్నా 
సందీప్ పిడి షాట్లు రేపుతున్నా 
అరూ బంతులు అరిపిస్తున్నా 
జానా లూపులు జడిపిస్తున్నా 
వేణు ఫోర్ హ్యాండ్ తో వేధిస్తున్నా 

ప్రసన్న వదనంతో ,అదే చెరగని చిరునవ్వుతో 

భీకరమైన వాలీలతో 

అచ్చెరువొందే డ్రాప్ లతో మరిపించి మురిపించే ..

అతనే డబుల్స్ లో సవ్యసాచి మన సచి ..
ధన్యవాదాలతో ..
చంద్ర కాటుబోయిన 🙏🏻

Sowjanya Song-Folk

 Folk Song on My Daughter

ననుగన్నా చిట్టీ తల్లి నా కన్న నాగవల్లి

చిన్నారి సిగలో మల్లి  అమ్మై పుట్టావె మల్లి

ఈ నాన్నా గుండెల నిండా చిన్నమ్మో...ఓ.ఓ.ఓ

జగమంతా వెలుగులపంటా మాయమ్మా...

జరగాలి జాతరలాగా మాయమ్మా....

ననుగన్నా చిట్టీ తల్లి నా కన్న నాగవల్లి

చిన్నారి సిగలో మల్లి  అమ్మై పుట్టావె మల్లి


మెరుపల్లె నా కంట ఉదయించె నా ఇంట

మురిసిందె ఊరూ వాడా వేనోళ్ళ కన్నుల పంట

నిశి మబ్బు రాతిరిలో తొలి సంధ్య వేకువల

విరిసిందె సౌజన్యంటు సన్నాయి పాటల్లె

ఊరంతా సంబరాలే చిన్నమ్మో...ఓ.ఓ.ఓ

అంబరాన్ని తాకె సూడమ్మో...."2"

ననుగన్నా చిట్టీ తల్లి నా కన్న నాగవల్లి

చిన్నారి సిగలో మల్లి  అమ్మై పుట్టావె మల్లి


ఈ ఎదనే పానుపుగా నిదురించే పదిలంగా

లేస్తూనె నాన్నంటూ వెదికేను మురిపెంగా

మనసంతా ఏకంగా తన ధ్యాసే లోకంగా..

రోజంతా ఉల్లాసంగా అలిసేను ఆడంగా

మళ్ళీ జనమంటూ ఉంటే చిన్నమ్మో....ఓ.ఓ.ఓ

తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా..

తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా..

ననుగన్నా చిట్టీ తల్లి నా కన్న నాగవల్లి

చిన్నారి సిగలో మల్లి  అమ్మై పుట్టావె మల్లి